Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు రికవరీ... రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత

పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు రికవరీ...  రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత
Share Short Clip Download PDF

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..

దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.
ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు.
సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు.
ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.