రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా,అక్రమ నిల్వ, మళ్లింపును అరికట్టేందుకు పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే చర్యలపై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, మళ్లించడం వల్ల వారికి నష్టం కలుగుతుందని సీపీ పేర్కొన్నారు.
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించడం,నిల్వ చేయడం,ఇతర ప్రాంతాలకు తరలించడం, మళ్లించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతోపాటు, వారి వెనుక ఉన్న నెట్‌వర్క్‌లపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అక్రమ రవాణాకు సహకరించే వ్యక్తులు, వాహనదారులు, నిర్వాహకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అక్రమ రవాణాకు అవకాశం ఉన్న మార్గాలు, సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచడంతోపాటు, అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీపీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు,సివిల్ సప్లైస్ అధికారులు కె. శ్రీనాథ్ (డీసీఎస్‌వో), సంతోష్ సింగ్ (డీటీ, పెద్దపల్లి), ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.