హనుమకొండ బ్యూరో(రైట్స్ మీడియా): పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని 2వ డివిజన్ గుండ్లసింగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన నూతన గృహాన్ని ఆయన ప్రారంభించారు.
రెండో డివిజన్ పరిధిలోని గుండ్లసింగారంలో మాదాసి దయాకర్–సుజాత దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వయంగా వెళ్లి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఇంటిని ప్రారంభించిన అనంతరం దయాకర్–సుజాత దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త ఇంటిలో వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.