తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ (ITI), స్కిల్ యూనివర్సిటీలలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ‘శక్తి స్కీమ్’ మరియు సంబంధిత జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మధిర పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి మధిర పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. జీఓను రద్దు చేయాలని డిమాండ్
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ..
పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఇతర సంస్థల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ‘శక్తి స్కీమ్’ను, సంబంధిత జీఓను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ ఆందోళనలో విద్యార్థులు, ఎస్ ఎఫ్ ఐ నాయకులు పాల్గొన్నారు.