రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం రోజున వర్ధన్నపేట మండల కేంద్రంలో వర్ధన్నపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుళ్ల కుమారస్వామి అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తుళ్ళ కుమారస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్‌లో ఎవరికీ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శాంతియుతంగా జాతీయ జెండాను ఆవిష్కరించామని తెలిపారు. జెండా ఎగురవేసే క్రమంలో తాడు విషయంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తినా, వెంటనే ఐదు సెకన్లలో సరిచేసి జాతీయ గీతాలాపనతో గౌరవ వందనం సమర్పించామని తెలిపారు.జాతీయ జెండాకు తాము ఎలాంటి అవమానం కలిగించలేదని అన్నారు. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఒత్తిడితో మున్సిపల్ కమిషనర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో పాటు సుమారు 25 మంది బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు,కార్మికులు, ఆటో యూనియన్ల వారు స్వచ్ఛందంగా జరుపుకున్నారని, కావాలని కేవలం బీఆర్‌ఎస్ శ్రేణులనే లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.గతంలో పోలీసు అధికారిగా పనిచేసిన ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత కూడా ఇంకా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వేరే చోట ఉన్నప్పటికీ, అంబేద్కర్ సెంటర్ వద్ద రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాల కార్యక్రమం నిర్వహించి గంటల తరబడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని ఆరోపించారు. దీనిపై సాధారణ పౌరులతో పాటు తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని హెచ్చరించారు. ఇది పోలీసు రాజ్యం కాదని,లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ అని గుర్తించి, ఎమ్మెల్యే తన తీరు మార్చుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గుజ్జ వీరన్న తిరుపతి సురేష్, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు కొండేటి సంపత్,మాజీ ఎంపీటీసీ నునవత్ వసంత్ నాయక్, నాయకులు తుమ్మల శ్రీధర్,సింగరబోయిన రాజశేఖర్, బానోతు నవీన్, భూక్యా రామన్న, పిట్టల రాజు, యువజన నాయకులు బొడ్డుపల్లి శ్రీకాంత్,మేకల శ్రీనివాస్,పసునూరి రమేష్ రామకృష్ణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకోవాలి
వర్ధన్నపేట ఎమ్మెల్యే వైఖరిపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం