వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని కోనారెడ్డి చెరువు అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకం నిధులతోనే శంకుస్థాపన చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పకపోవడం దురదృష్టకరమని బిజెపి నాయకులు మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ లోని కోణారెడ్డి చెరువు దగ్గర శుక్రవారం రోజున వర్ధన్నపేట బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఆడుప రాజు ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నాల వెంకటరమణ మాట్లాడుతూ.. కోనారెడ్డి చెరువు రేజువేనేషన్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రారంభించిన శిలాఫలకం పై కేంద్ర మంత్రి పేరు ఉన్నప్పటికీ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ 2.0 పేరు ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా ప్రసారం చేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే రాష్ట్ర నాయకులు క్రెడిట్ కొట్టేయాలని చూడడం సరికాదని, ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు అని అన్నారు. ఇప్పటికైనా అమృత్ 2.0 పథకం కింద మంజూరైన నిధులను రైతులకు ఉపయోగపడే విధంగా నిబంధనల ప్రకారం అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాయపురం కుమారస్వామి, బీజేపీ నాయకులు పెద్దూరి రాజు, దేవేందర్, రాము, సుంకరి బాబు, కార్తీక్, మహంతు, హరీష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమృత్ 2.0 నిధులపై కేంద్ర ప్రభుత్వ పేరును ఎమ్మెల్యే ప్రస్తావించకపోవడం దురదృష్టకరం
వర్ధన్నపేట బిజెపి నాయకులు.