ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ సమర్పించిన అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.

వేంనూరు మండలం లింగపాలెం ఎస్సి కాలనీ వాసులు గ్రామపంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టుట కొరకు గ్రామ పంచాయతీ రోడ్డు ఇరువైపుల డ్రైనేజీ లను పూడ్చివేశారని, డ్రైన్ లో అక్రమంగా బోరు వేసారని, ఈ పరిస్థితులకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఖమ్మం నగరం వైఎస్సార్ నగర్ కాలనీ కు చెందిన కాలనీ వాసులు అంబేద్కర్ విగ్రహం ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమించేందుకు ఆగస్టు 23న అర్ధరాత్రి సేవా లాల్ విగ్రహం పెట్టడం జరిగిందని, గొడవలు అయ్యే అవకాశం ఉన్నదని, ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు .

వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన అశోక్ తాను ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ పరీక్షలో ఉత్తీర్ణుడై ఉన్నానని, తనకు ఆధార్ సేవలు అందించేందుకు వీలుగా అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈడీఎం కు రాస్తూ పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దీక్షా రైనా, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.