జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఖమ్మం ఆధ్వర్యంలో ప్రభుత్వ దివ్యాంగ బాలుర వసతి గృహంలో దివ్యాంగుల కోసం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి పి. దేవి మానస పాల్గొని దివ్యాంగులకు అందుబాటులో ఉన్న చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాల గురించి వివరించారు.
దివ్యాంగులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
డీఎల్ఎస్ఏ కార్యదర్శి పి. దేవి మానస.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
దివ్యాంగులు స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగజన్ కౌశల్ వికాస్ పథకం ద్వారా నైపుణ్యాభివృద్ధి అవకాశాలను, దివ్యాంగజన్ రోజ్‌గార్ సేతు ద్వారా ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 ద్వారా దివ్యాంగులకు కల్పించిన హక్కులు, రక్షణలు, సమాన అవకాశాల గురించి వివరించారు.
దివ్యాంగుల విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అర్హులైన దివ్యాంగులు తమ హక్కులను తెలుసుకొని సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం మరియు న్యాయ సలహా అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎ. ప్రమీల, డీఎల్ఎస్ఏ ప్యానెల్ న్యాయవాదులు, సంబంధిత శాఖ సిబ్బంది మరియు దివ్యాంగులు పాల్గొన్నారు.