Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

కులవృత్తులకు అండగా ప్రజా ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్

⏩గొర్రెల పెంపకందారులకు బీమా, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనకు చర్యలు.. కులవృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతాం: మంత్రి పొన్నం ప్రభాకర్

కులవృత్తులకు అండగా ప్రజా ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్
Share Short Clip Download PDF

⏩ఇందిరా భవన్ లో కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం మొదటి మహాసభలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం,వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు ఇతర ముఖ్య నేతలు.

⏩ పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్(రైట్స్ మీడియా): కులవృత్తులను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గొర్రెల పెంపకందారులతో తనకు చాలా కాలంగా అనుబంధం ఉందని, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసునని అన్నారు.

గొర్రెల పెంపకందారుల కోసం గతంలో కేటాయించిన స్థలాలు, సంఘ భవనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుందని తెలిపారు. గతంలో తన ఎంపీ నిధులతో సంఘానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

కులవృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి

కులవృత్తులను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వారికి 50 సంవత్సరాల వయస్సు నుంచే పెన్షన్ అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ముదిరాజులు, గీత కార్మికులు, యాదవులు, నాయీ బ్రాహ్మణులు తదితర కులవృత్తిదారులందరికీ ఈ ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.

కులవృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి

గొర్రెల పెంపకందారులకు బీమా

గొర్రెలు, మేకలు, ఇతర పశువులకు బీమా సౌకర్యాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు పంట బీమా ఎంత ముఖ్యమో, పశుపోషకులకు పశువుల బీమా కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది అని మంత్రి తెలిపారు.

మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి

గొర్రెల పెంపకందారులకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ అవసరమని మంత్రి అన్నారు. హోల్‌సేల్ మార్కెట్లు, మార్కెటింగ్ సౌకర్యాలు, నిల్వ మరియు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తే గొర్రెల పెంపకందారులకు మెరుగైన ధరలు లభిస్తాయని చెప్పారు. ఒక కుటుంబం వంద గొర్రెలను పెంచుతున్నప్పటికీ వాటి విలువ గణనీయంగా ఉన్నందున, ఆ సంపదను కాపాడేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

పిల్లల చదువుపైనే ప్రధాన దృష్టి

సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన నేపథ్యంలో వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిశీలించినప్పుడు, అనేక కుటుంబాలు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం విద్యేనని చెప్పారు. “డబ్బు, భూమి, ఆస్తులు ఉన్నా కాలానుగుణంగా మారుతున్న పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే మన పిల్లలను బాగా చదివించాలి. విద్య ఒక్కటే మన భవిష్యత్ తరాలకు బలమైన పునాది” అని అన్నారు.

పిల్లల చదువుపైనే ప్రధాన దృష్టి

గొర్రెల పెంపకానికి ప్రభుత్వ భూములు వినియోగించాలి

రాష్ట్రంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ కారణంగా పశువుల పెంపకానికి అవసరమైన స్థలాలు తగ్గిపోతున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో అందుబాటులో ఉన్న అనువైన భూములను గుర్తించి, గొర్రెలు, మేకల పెంపకానికి అవసరమైన విధంగా సంఘాలకు కేటాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.

యాదవులకు గతంలో జీవో నంబర్ 559, గీత కార్మికులకు సంబంధించిన జీవో నంబర్ 543 ద్వారా భూములు కేటాయించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. అదే విధంగా ప్రస్తుతం గొర్రెల పెంపకందారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ భూముల వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పశుసంవర్ధక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత

వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు తదితర పశువులకు మెరుగైన పశువైద్య సేవలు, వ్యాధి నిరోధక చర్యలు, బీమా, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను సంబంధిత శాఖ మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

కులవృత్తులను బలోపేతం చేయడం, గ్రామీణ కుటుంబాల ఆదాయం పెంచడం, పిల్లలకు మెరుగైన విద్య అందించడం ద్వారా తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

పశుసంవర్ధక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత
కులవృత్తులకు అండగా ప్రజా ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్