Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Share Short Clip Download PDF

ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ప్రజాభవన్లో మంత్రులు భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 19 నుంచి 'రాజీవ్ యువ వికాసం' ద్వారా రూ.లక్ష లోపు ఆర్థిక సహాయ యూనిట్ల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ గురుకులాల్లో రూ.25 కోట్లతో మెకనైజ్డ్ కిచెన్ల ఏర్పాటు, పూర్వ విద్యార్థుల ప్రగతిపై సెస్ అధ్యయనం, డిగ్రీ కాలేజీల్లో నూతన కోర్సుల ప్రవేశానికి కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమగ్ర అభ్యున్నతికే ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని, పేద వర్గాల విద్యాభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు వెనుకాడబోమని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం ప్రజాభవన్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, గురుకులాల నిర్వహణ, విద్యా మౌలిక వసతులు, స్వయం ఉపాధి పథకాలపై ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యువత స్వయం ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్లో నిధులు సమకూర్చామని, 'రాజీవ్ యువ వికాసం' పథకం కింద నవంబర్ 19 నుంచి తొలి విడతగా రూ. లక్ష వరకు ఆర్థిక సహాయం యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శక విధానంలో అర్హులను ఎంపిక చేయాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు నిత్యం శుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కేంద్రీకృత యంత్రాల వంటశాలలు (మెకనైజ్డ్ కిచెన్స్) ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇందుకోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 25 కోట్ల నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, రాబోయే 15 రోజుల్లో పక్కా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్, సంక్షేమ గురుకులాల నుంచి గత పదేళ్లలో చదువు పూర్తిచేసుకున్న పూర్వ విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ‘సెస్’ (CESS) సంస్థతో అధ్యయనం చేయించి సమగ్ర డేటాబేస్ రూపొందించాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 30 డిగ్రీ కళాశాలల్లో పరిశ్రమల అవసరాలకు తగిన సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టి, వాటిని స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానించాలని సూచించారు.