హనుమకొండ(రైట్స్ మీడియా): కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉచిత కోచింగ్‌ను పోటీ పరీక్షల అభ్యర్థులందరు సద్వినియోగం చేసుకోవాలని పాలమూరు విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ డాక్టర్ భూమయ్య అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ‘ఇండియన్ పాలిటీ’ అంశంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పాలమూరు విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ డాక్టర్ భూమయ్య ముఖ్య అతిథిగా, వక్తగా హాజరై అభ్యర్థులకు మార్గదర్శనం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ప్రత్యేక ఆదేశాలు, ప్రోత్సాహంతో ఈ శిక్షణా తరగతిని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిక్షణలో డాక్టర్ భూమయ్య భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీకి సంబంధించిన పలు కీలక అంశాలను అభ్యర్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ భూమయ్య మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో ‘ఇండియన్ పాలిటీ’ కీలకమైన అంశమని, సరైన ప్రణాళికతో అధ్యయనం చేసి, క్రమం తప్పకుండా పునశ్చరణ చేస్తే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. అభ్యర్థులు రాజ్యాంగ అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
సివిల్స్, గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పెద్ద సంఖ్యలో అభ్యర్థులు శిక్షణ తరగతులకు హాజరై, సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
రోజంతా అభ్యర్థులకు సమయాన్ని కేటాయించి, నాణ్యమైన శిక్షణ అందించిన డాక్టర్ భూమయ్యకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.