బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి. అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800 425 0101 నంబర్లను సంప్రదించాలని సూచించారు.