Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

యువతలో నాయకత్వ లక్షణాలను పెంపోందించడంలో ఎన్ఎస్ఎస్ కీలక పాత్ర: కేయూ వీసి ఆచార్యులు కే. ప్రతాప్ రెడ్డి

యువతలో నాయకత్వ లక్షణాలను పెంపోందించడంలో ఎన్ఎస్ఎస్ కీలక పాత్ర: కేయూ వీసి ఆచార్యులు కే. ప్రతాప్ రెడ్డి
Share Short Clip Download PDF

యువతలో నాయకత్వ లక్షణాలు, సేవా స్ఫూర్తి, బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందించడంలో జాతీయ సేవా పథకం (NSS) కీలక పాత్ర పోషిస్తోందని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా గురువారం విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో NSS ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. NSS ప్రోగ్రామ్ సమన్వయ అధికారి ఆచార్య ఈసం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వైస్‌ఛాన్సలర్ ముఖ్య అతిథిగా హాజరై మాజీ, ప్రస్తుత NSS ప్రోగ్రామ్ అధికారులు, వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా వైస్‌ఛాన్సలర్ మాట్లాడుతూ,

కాకతీయ విశ్వవిద్యాలయం విద్య, పరిశోధనతో పాటు సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, పరిశుభ్రత, నాయకత్వ వికాసం వంటి రంగాల్లో NSS ద్వారా విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. విశ్వవిద్యాలయ పరిధిలో 360కి పైగా NSS యూనిట్లు, సుమారు 35,000 మంది వాలంటీర్లతో విస్తృత స్థాయిలో సేవా, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. NSS సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమాజ అవసరాలకు అనుగుణంగా NSS వాలంటీర్లు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విద్యార్థుల్లో సేవా స్ఫూర్తితో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నారని అన్నారు. K-Hub ద్వారా విద్యార్థుల్లో వ్యవస్థాపకత, స్టార్టప్‌లు, ఆవిష్కరణలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మాజీ పార్లమెంటు సభ్యులు ఆచార్య ఆజ్మీర్ సీతారాం నాయక్ సహకారంతో NSSకు శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు.

NSS ప్రోగ్రామ్ సమన్వయ అధికారి ఆచార్య ఈసం నారాయణ మాట్లాడుతూ, కాకతీయ విశ్వవిద్యాలయ NSS రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, పురస్కారాలు సాధించిందన్నారు. ప్రోగ్రామ్ సమన్వయ అధికారులు, ప్రోగ్రామ్ అధికారులు, వాలంటీర్లు వివిధ స్థాయిల్లో ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. NSS వాలంటీర్లు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందడంతో పాటు ప్రముఖ రియాలిటీ షోలలో తమ ప్రతిభను ప్రదర్శించారని అన్నారు. NSS ఘన వారసత్వాన్ని ప్రస్తుత తరం కొనసాగిస్తూ సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మాజీ NSS ప్రోగ్రామ్ సమన్వయ అధికారి, మాజీ పార్లమెంటు సభ్యులు ఆచార్య ఆజ్మీర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ, తన జీవితంలో NSS కీలకమైన అవకాశాలకు వేదికగా నిలిచిందన్నారు. NSS ద్వారా ప్రజా సేవ పట్ల తనలో మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని, NSS సేవలను మరింత విస్తరించేందుకు విశ్వవిద్యాలయంలో NSS భవన్ నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు.

తెలంగాణ అకాడమీ ఛైర్మన్, మాజీ NSS సమన్వయ అధికారి ఆచార్య కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వంటి భారీ ప్రజా సమూహాలు పాల్గొనే కార్యక్రమాల్లో NSS వాలంటీర్లు అందించిన సేవలు విశేషమైనవని అన్నారు. సేవా, అవగాహన కార్యక్రమాల ద్వారా వేలాది మంది విద్యార్థుల్లో సేవా స్ఫూర్తిని పెంపొందించామని తెలిపారు. NSS యువతను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే ఉద్యమమని పేర్కొన్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ, విద్యార్థుల నైపుణ్య, వ్యక్తిత్వ, మానసిక వికాసానికి విశ్వవిద్యాలయం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావడంలో NSS ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా పూర్వపు NSS వాలంటీర్లు రూపొందించిన “సేవా కులం” పాటను ఆవిష్కరించారు. మాజీ NSS సమన్వయ అధికారులు, ప్రోగ్రామ్ అధికారులు, వాలంటీర్లు, ప్రస్తుత NSS అధికారులు, వాలంటీర్లను వారి సేవలకు గుర్తింపుగా శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థుల పాటలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య టి. మనోహర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్. రమణ, మాజీ NSS సమన్వయ అధికారులు ఆచార్య జి. బాలస్వామి, ఆచార్య ఎం. కిష్టయ్య, ఆచార్య బి. సురేష్ లాల్, ఆచార్య సుంకరి జ్యోతి, పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్రా రాజు, ప్రోగ్రామ్ అధికారులు ప్రవీణ్, ప్రభాకర్, రాధిక, సౌజన్య, NSS వాలంటీర్లు, ప్రోగ్రామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

యువతలో నాయకత్వ లక్షణాలను పెంపోందించడంలో  ఎన్ఎస్ఎస్ కీలక పాత్ర