Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

జన్మదిన వేడుకల పేరిట డబ్బు వృథా చేయొద్దు: మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

⏩జంగపల్లి హైస్కూల్ విద్యార్థులకు సర్పంచ్ దంపతుల ప్లేట్ల పంపిణీ

జన్మదిన వేడుకల పేరిట డబ్బు వృథా చేయొద్దు: మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
Share Short Clip Download PDF

జన్మదిన వేడుకల పేరుతో డబ్బును ఆర్భాటంగా ఖర్చు చేయకుండా సమాజానికి, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు వెచ్చించాలని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామ సర్పంచ్ తాడూరి కరుణశ్రీ–రమణారెడ్డి దంపతుల కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు , గ్లాసుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ కుమార్తె జన్మదినం సందర్భంగా సొంత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు అందించడం అభినందనీయమన్నారు. జన్మదిన వేడుకల పేరుతో తల్లిదండ్రులు ఆర్భాటాలకు వెళ్లి అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, ఆ మొత్తాన్ని విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందించేందుకు లేదా ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తే మరింత సార్థకత ఉంటుందని అన్నారు. పిల్లలు కూడా తమ పుట్టినరోజు సందర్భంగా తోటి విద్యార్థులకు పుస్తకాలను కానుకగా అందించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.

ఫోన్లకు దూరంగా.. చదువుపై దృష్టి

విద్యార్థులు సెల్‌ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి చదువుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులపై టీవీలు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉందన్నారు. వాటికి దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ఇచ్చే హోంవర్క్‌ను ఇంటికి వెళ్లిన తర్వాత పూర్తి చేయడంతో పాటు పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ వార్తాపత్రికలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.