Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

వైద్య ఆరోగ్య శాఖలో మౌళిక వసతులు, సివిల్ పనులు, పరికరాలపై వైద్య అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
Share Short Clip Download PDF

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన మౌళిక వసతులు, వైద్య పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ శాఖ, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మౌళిక వసతులు, సివిల్ పనులు, వైద్య పరికరాలు, ల్యాబొరేటరీలు, డయాగ్నస్టిక్ హబ్‌ల పనితీరుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ..

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రస్తుతం చేపడుతున్న సివిల్ పనులు భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడేలా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టాల్సిన సివిల్ పనులను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించాలని అన్నారు. ప్రస్తుతం రోగుల సేవలకు అత్యవసరంగా అవసరమైన సౌకర్యాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరం లేని పనులకు నిధులు ఖర్చు చేయవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులను అత్యంత సమర్థవంతంగా, పొదుపుగా వినియోగించాలని ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ పనులకు సంబంధించి సుమారు రూ. 5.20 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినందున వాటిని వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఏరియా ఆసుపత్రులకు పరికరాల కొనుగోలుకు నిధులు

సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాల కోసం మొదటి దశలో రూ. 30 లక్షల చొప్పున, కల్లూరు సి.హెచ్.సి. కి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వైద్య పరికరాల ఎంపికలో ఒకే పరికరంతో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండేలా చూడాలని అన్నారు. పరికరాలకు గ్యారెంటీతో పాటు ప్రాథమిక నిర్వహణ, సర్వీసింగ్‌కు సంబంధించి హామీ ఉండేలా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.

కెనరా బ్యాంకు ద్వారా 10 ఆర్ఓ ప్లాంట్లు అందించేందుకు ముందుకు వచ్చినందున వాటిని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు అవసరమైన ఇతర ఆసుపత్రుల్లో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర సివిల్ మౌళిక వసతుల అవసరం ఉన్న ఆసుపత్రుల్లో తక్కువ వ్యయంతో, వేగంగా ఏర్పాటు చేయగల ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణా లను అవసరమైన చోట వినియోగించాలని అన్నారు. సివిల్ పనుల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు.

ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి

ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో లేరని, వైద్యుల కుర్చీలు ఖాళీగా ఉన్నాయని ఫిర్యాదులు రావడం నివారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి వైద్యుడు సమయానికి విధులకు హాజరై, ప్రత్యామ్నాయ షిఫ్ట్ వైద్యుడు వచ్చే వరకు విధుల్లో ఉండాలని సూచించారు. ప్రజలకు వైద్యుడు అందుబాటులో లేరనే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని అన్నారు.

అవసరం లేని డిప్యూటేషన్లను నివారించాలని, రోగుల అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే డిప్యూటేషన్లు ప్రతిపాదించాలని అన్నారు. డిప్యూటేషన్ల విషయంలో పరిపాలనా అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి సిఫార్సులకు తావు ఇవ్వవద్దని స్పష్టం చేశారు.

కొత్త పెన్షన్ల మంజూరుకు అర్హుల వివరాలను వెంటనే పంపాలి..

ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తున్నందున, జిల్లాలోని అర్హత కలిగిన వారికి పెన్షన్లు మంజూరయ్యేలా అవసరమైన సమాచారాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి వెంటనే పంపించాలని సూచించారు. అర్హతల పరిశీలన, అవసరమైన ధృవీకరణ ప్రక్రియను అత్యంత త్వరగా పూర్తి చేయాలని, ఒక్క అర్హుడూ ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనం నుంచి మినహాయించ బడకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆసుపత్రుల సమస్యలను వెంటనే నివేదించాలి

ఆసుపత్రుల్లో ఏ సమస్య తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పత్రికల్లో వార్తలు వచ్చిన తర్వాత లేదా ఇతర మార్గాల ద్వారా సమస్యలు తనకు తెలిసే పరిస్థితి ఉండకూడదని, క్షేత్రస్థాయి అధికారులు సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని సూచించారు.

ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్థానిక సంస్థల ద్వారా ఆసుపత్రులను శుభ్రపరిచేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఒక వారం ఆసుపత్రులు, మరో వారం గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలను శుభ్రపరిచే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

అన్ని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలి

అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఏర్పాటు చేసి నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్ల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించాలని సూచించారు. అవసరమైన చోట తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించేందుకు అనుమతి పొందేలా ప్రతిపాదనలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.

క్షేత్ర స్థాయిలోని సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ

జిల్లాలోని 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సివిల్ పనులను చేపట్టేందుకు సుమారు రూ. 520.18 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను అధికారులు రూపొందించినట్లు తెలిపారు. ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 2 పి.హెచ్.సిలు, ఒక యు.పి.హెచ్.సి., 7 ఏఏఎం కేంద్రాల్లో ఎన్క్వాస్ ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన పనులను చేపట్టేందుకు రూ. 9.918 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పి.హెచ్.సిలకు అవసరమైన వైద్య పరికరాల కోసం రూ. 46.57 లక్షలు, సబ్ సెంటర్లకు అవసరమైన పరికరాల కోసం రూ. 9.42 లక్షల అంచనా వ్యయంతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు.

197 సబ్ సెంటర్ కేంద్రాల్లో అవసరమైన సివిల్ పనులకు రూ. 2.165 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలపగా, ప్రతి కేంద్రంలో ప్రజలకు అవసరమైన కనీస మౌళిక వసతులు అందుబాటులో ఉండేలా పనులను గుర్తించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ డి. రామారావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. రాజశేఖర్, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వేణుమాధవ్, వైద్య ఆరోగ్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, వైద్యాధికారులు, ఇంజినీరింగ్ శాఖ, స్థానిక సంస్థలు, సంబంధిత విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.