హనుమకొండ (రైట్స్ మీడియా):
క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం గ్రౌండ్స్‌లో యువ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – 2026, ఎడిషన్ 02’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్ ని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హన్మకొండ కిషన్ పురలోని వారి నివాసంలో విష్ణువర్ధన్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 21 కిలోమీటర్ల టైమ్డ్ రన్, 10 కిలోమీటర్ల పరుగు, 5 కిలోమీటర్ల ఫన్ రన్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. వివిధ వయసుల వారు, క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీన కాళోజీ కళాక్షేత్రం గ్రౌండ్స్‌లో ప్రారంభమై, అదే ప్రాంగణంలో ముగియనున్న ఈ మారథాన్‌లో పాల్గొనాలనుకునే వారు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ సయ్యద్ ఇంతియాజ్, ఆరేపల్లి మాజీ పాక్స్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుద్దే పెద్దన్న,14 డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.