నరసరావుపేట(రైట్స్ మీడియా): నరసరావుపేట పట్టణంలోని ముస్లిం సోదరుల సద్భావన భవనాన్ని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మంగళవారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా సద్భావన భవనంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యే పరిశీలించి, భవనానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలపై ముస్లిం సోదరులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
“అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందితేనే నరసరావుపేట సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి వర్గం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యం” అని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు.