Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

గౌడ హాస్టల్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

• విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తాం

గౌడ హాస్టల్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Share Short Clip Download PDF

• విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి పోటీ ప్రపంచంలో రాణించాలి

• గౌడ సత్రాలు, హాస్టళ్ల నిర్మాణం ద్వారా విద్యార్థులకు అండగా నిలవాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

సంగారెడ్డి (రైట్స్ మీడియా): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని నందిగామలో నూతనంగా నిర్మించిన గౌడ హాస్టల్ భవనాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్టల్ నిర్మాణానికి సహకరించిన దాతలకు మంత్రి అభినందనలు తెలిపారు. గౌడ హాస్టల్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులకు, గౌడ సంఘం ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గౌడ హాస్టల్ అధ్యక్షుడు చక్రవర్తి గౌడ్, తుళ్ల వీరేందర్ గౌడ్, కాట శ్రీనివాస్ గౌడ్, గీతా కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ

విద్యార్థుల విద్యాభివృద్ధి, వారి ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి, పోటీ ప్రపంచంలో రాణించాలని సూచించారు.

ఇప్పటికే హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌తో పాటు కరీంనగర్‌లో గౌడ హాస్టళ్లను నిర్మించుకున్నామని తెలిపారు. వేములవాడ, కొమురవెల్లిలో గౌడ సత్రాలను నిర్మించుకున్నామని, జోగులాంబ ప్రాంతంలో కూడా గౌడ సత్రం నిర్మించుకోనున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి తోడ్పడవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ

మన సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది సివిల్ సర్వెంట్లు తయారయ్యేలా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు కృషి చేయాలని, ఈ దిశగా ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

విద్యార్థులు, విద్యార్థినులకు సమాన అవకాశాలు కల్పిస్తూ, వారు ఉన్నత విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సమాజంలోని పెద్దలు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల కోసం హాస్టళ్లు, వసతి గృహాలు, సత్రాలు నిర్మించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఆర్థికంగా స్థిరపడిన వారు పేద విద్యార్థుల చదువుకు, పోటీ పరీక్షల కోచింగ్‌కు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, దాతలు, సంఘాల సమష్టి కృషితో విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.

గౌడ సంఘం ఉద్యోగులందరూ జిల్లా స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ, సంఘటితంగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. ఉద్యోగుల వివరాలను సమీకరించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

గతంలో పెద్దలు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని, వారి కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కొత్త కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, వసతి సౌకర్యాల కల్పన, యువతకు శిక్షణ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతతో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

గౌడ హాస్టల్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్