సిద్దిపేట (రైట్స్ మీడియా): సాయుధపోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు సరితా తిరుపతయ్య యాదవ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చరణ్ కౌశిక్ యాదవ్ మరియు ఇతర ముఖ్య నేతలు ఘనంగా నివాళులర్పించారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం ఉద్యమిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్
⏩సిద్దిపేటలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు.
⏩ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు.
⏩దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలని డిమాండ్.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, వారి పోరాట స్ఫూర్తిని మరోసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు నడవాల్సిన రోజు అని పేర్కొన్నారు. ఇలాంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం కేవలం గౌరవం కోసం మాత్రమే కాదని, వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయడం కోసమని, సమాజంలో అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా వారు ఏ విధంగా ఎదురొడ్డి నిలబడి పోరాడారో చరిత్రకు చాటి చెప్పడం కోసమని అన్నారు.
తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలిగా నిలిచారని, అదే విధంగా దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న, కొమురం భీమ్, రావి నారాయణరెడ్డి వంటి అనేక మంది యోధులు ప్రజల హక్కుల కోసం, ఆనాటి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. వారి పోరాటాల ఫలితంగానే నేడు మనం ప్రజాస్వామ్య హక్కులను అనుభవిస్తున్నామని పేర్కొంటూ ఆ మహనీయులందరికీ హృదయపూర్వక నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే నేటి యువత కూడా సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈరోజు మనం అడుగుతున్న ఒక చిన్న న్యాయమైన కోరికను కూడా నెరవేర్చలేని పరిస్థితులు ఎందుకు ఉన్నాయో ఆలోచించాలని ఆయన కోరారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయి అనే విషయాలపై ప్రభుత్వ శాఖల వద్ద లెక్కలు ఉన్నాయని, కానీ మన సమాజంలో ఎంతమంది ఏ వర్గానికి చెందినవారు ఉన్నారు అనే కుల జనాభా లెక్కలు మాత్రం మనకు స్పష్టంగా తెలియని పరిస్థితి ఉందన్నారు. దేశవ్యాప్తంగా కుల జనాభా లెక్కలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఉద్యమం కొనసాగుతోందని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో కులాల వారీగా జనాభాను తెలుసుకునే అవకాశం కల్పించాలనేది మా ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో సిద్ధిపేట జిల్లా నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగించాలని మంత్రి పిలుపునిచ్చారు. కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించడం ద్వారా ఆయా వర్గాల జనాభా ఎంత ఉందో, వారికి ఎంత ప్రాతినిధ్యం, ఎంత వాటా అవసరమో శాస్త్రీయంగా నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కుల గణన చేసిందని, అయితే 50 శాతం రిజర్వేషన్ పరిమితి, న్యాయపరమైన అంశాల నేపథ్యంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే కచ్చితమైన, ప్రామాణికమైన, కులాల వారీగా జనాభా లెక్కలు అవసరమని పేర్కొన్నారు. అందుకే దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో కులాల వారీగా జనాభా వివరాలను సేకరించేందుకు ప్రత్యేక అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, సామాజిక న్యాయం కోసం మన పోరాటాన్ని కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.