మహబూబాబాద్,అక్టోబర్ 31(రైట్స్ మీడియా): శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమం (LCDС) 22.10.2026 నుండి 04.11.2026 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటా సర్వే నిర్వహించి కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ప్రారంభ దశలోనే వైద్య పరీక్షలు మరియు చికిత్స అందించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
కుష్టు వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని, ఇది ప్రధానంగా చర్మం మరియు నరాలపై ప్రభావం చూపుతుందని వివరించారు. చర్మంపై స్పర్శలేని ఎరుపు లేదా రాగి రంగు మచ్చలు, చేతులు మరియు కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత, గాయాలైనప్పుడు నొప్పి తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఈ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.
ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటా సర్వే ద్వారా అనుమానితులను గుర్తించి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించడం జరుగుతుందని, వైద్య పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధారణ అయిన వారికి బహుళ ఔషధ చికిత్స (MDT) పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు.
22.10.2026 నుండి 31.10.2026 వరకు జిల్లాలో నిర్వహించిన కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేలో మొత్తం 886 బృందాలు ఇంటింటా సర్వే నిర్వహించగా 1,49,462 ఇళ్లలో సర్వే పూర్తి చేశారని 4,77,597 మందికి పరీక్షలు నిర్వహించగా 1,520 మంది అనుమానితులను గుర్తించారన్నారు.
కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే 04.11.2026 వరకు కొనసాగుతుందని, జిల్లాలోని ప్రజలందరూ వైద్య సిబ్బందికి సహకరించి, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అర్జున్, డీపీఎంఓ వాల్యా నాయక్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.