Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఖిలా వరంగల్ గుండం చెరువు ప్రాంతంలో లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభం

ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

ఖిలా వరంగల్ గుండం చెరువు ప్రాంతంలో లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభం
Share Short Clip Download PDF

ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

వరంగల్ ( రైట్స్ మీడియా): వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి ఆదేశాల మేరకు, జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఖిలా వరంగల్‌లోని గుండం చెరువు ప్రాంతంలో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (LCDC) కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ సాజిదా, డాక్టర్ ఇక్తిదార్ అహ్మద్, డాక్టర్ అరుణ్ జోషి ప్రారంభించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,

ఈ ఇంటింటి సర్వే కార్యక్రమం 14 రోజుల పాటు కొనసాగుతుందని, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబంలోని వ్యక్తులందరిలో కుష్టు వ్యాధి అనుమానిత లక్షణాలను పరిశీలిస్తారని తెలిపారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులకు సకాలంలో చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,

కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తూ ఐ.ఇ.సి.(కరపత్రాలు)పంపకం

కుష్టు వ్యాధి ముఖ్యంగా చర్మంపై లేత గోధుమ లేదా ఇతర రంగుల్లో కనిపించే మచ్చలు, ఆయా మచ్చలపై స్పర్శ జ్ఞానం తగ్గడం లేదా పూర్తిగా లేకపోవడం వంటి లక్షణాలతో గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. చర్మంపై మచ్చలు ఉన్నంత మాత్రాన కుష్టు వ్యాధి అని నిర్ధారించలేమని, వైద్యుల పరీక్షల ద్వారా మాత్రమే వ్యాధిని నిర్ధారించుకోవాలని సూచించారు.
కుష్టు వ్యాధి సోకిన వారిలో స్పర్శ జ్ఞానం తగ్గడం వల్ల కాలక్రమేణా చేతులు, కాళ్లకు గాయాలు ఏర్పడే అవకాశం ఉందని, చికిత్స ఆలస్యమైతే వైకల్యాలు సంభవించవచ్చని వివరించారు. అందువల్ల అనుమానిత లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

కుష్టు వ్యాధి పూర్తిగా నయమయ్యే వ్యాధి అంటూ ప్రచారం

కుష్టు వ్యాధి బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి అని, ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. కుష్టు వ్యాధి సోకిన వ్యక్తులను అంటరానివారిగా చూడాల్సిన అవసరం లేదని, వ్యాధిపై అపోహలు, వివక్షకు తావివ్వకూడదని తెలిపారు.వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా బహుళ ఔషధ చికిత్స (Multi-Drug Therapy – MDT) అందుబాటులో ఉంటుందని వివరించారు. వైద్యుల సూచనల మేరకు మందులను క్రమం తప్పకుండా, నిర్దేశించిన కాలవ్యవధి వరకు వాడితే కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు.

ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి

లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వచ్చే ఆశా కార్యకర్తలకు ప్రజలందరూ సహకరించాలని అధికారులు కోరారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ పరీక్షించేందుకు సహకరించి, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కుష్టు వ్యాధి నిర్ధారణ అయినవారు చికిత్సను మధ్యలో ఆపకుండా పూర్తికాలం మందులు వాడాలని, వ్యాధి పట్ల అపోహలు వీడి బాధితులకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించడం, సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా వైకల్యాలను నివారించవచ్చని, కుష్టు వ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ విభాగం వైద్యాధికారి డాక్టర్ మానస శ్యామల, స్థానిక వైద్యాధికారి డాక్టర్ వేద కిరణ్, డిపిఎంఓ అనుపమ, డిపిఎంఓ వెంకన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, డిపిహెచ్‌ఎన్‌ఓ మనోజ, డిపిసి ప్రకాష్ రెడ్డి, ఎల్‌డీ కంప్యూటర్ నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ సంజీవ్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Source / reference: Journalist Ch. Ramesh, Warangal District.