కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కాంక్రీట్ నాణ్యతపై కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిర్వహించిన పరీక్షల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ పరీక్షల ఫలితాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అన్నారం బ్యారేజీలోని 72 పియర్స్‌పై కాంక్రీట్ నాణ్యత పరీక్షలు నిర్వహించగా ఎలాంటి నాణ్యతా లోపాలు గుర్తించలేదని సీడబ్ల్యూపీఆర్ఎస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పరీక్షించిన పియర్స్‌లో నాణ్యత ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అదేవిధంగా సుందిళ్ల బ్యారేజీలోని ఏడు బ్లాకుల్లో ఉన్న పియర్స్‌పై పరీక్షలు నిర్వహించగా, కాంక్రీట్ నాణ్యత చాలా బాగుందని పరీక్షా ఫలితాలు వెల్లడించినట్లు సమాచారం.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సీడబ్ల్యూపీఆర్ఎస్ కీలక నివేదిక..
- సీఎం రేవంత్ ప్రభుత్వ ఆరోపణలకు గట్టి ఎదురుదెబ్బ. - కాంక్రీట్ నాణ్యత పరీక్షల్లో కీలక విషయాలు వెల్లడి.
మేడిగడ్డపైనా కీలక పరిశీలనలు..
మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా పరీక్షల్లో పలు అంశాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. 7వ బ్లాక్ మినహా మిగిలిన ఏడు బ్లాకుల్లో కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి సమస్యలు లేవని నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. కుంగిపోయిన 7వ బ్లాక్‌లోని పియర్స్‌లో ఐదు పియర్స్ నాణ్యత బాగున్నట్లు, మరో ఆరు పియర్స్ నాణ్యతపై సందేహాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలను ఒకే కోణంలో చూసి విమర్శలు చేయడం సరికాదని, సాంకేతిక సంస్థలు నిర్వహించిన పరీక్షలు, నిపుణుల నివేదికల ఆధారంగానే వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.