హైదరాబాద్ (రైట్స్ మీడియా): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, భారతీయ జనతా పార్టీ నాయకులు దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. 'మాదిగ డప్పు, మాల గుతుప' లతో దళిత సంఘాలు కదం తొక్కాయి. మాదిగ మాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం (అక్టోబర్ 4న) హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వందలాది డప్పుల దరువులతో నిరసన ర్యాలీ హోరెత్తింది. వందలాది మంది దళితుల డప్పుల దరువులతో అంబేద్కర్ చౌరస్తా దద్దరిల్లింది.
కేసీఆర్, బీజేపీలు క్షమాపణ చెప్పాల్సిందే.. ట్యాంక్‌బండ్‌పై దద్దరిల్లిన డప్పుల దరువు
⏩కేసీఆర్ వైఖరికి నిరసనగా దసరాకు ముందే సిద్దిపేటలో 1000 డప్పులతో దండోరా: మాదిగ మాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ
⏩దళితవాడలకు వస్తే డప్పులు, గుతుప లతో తరిమికొడతామని హెచ్చరిక
అసలేం జరిగింది?
కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దళితులను, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించేలా ఉన్నాయని దళిత సంఘాలు మండిపడ్డాయి. అలాగే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే, ఆయన దళితుడు అన్న కారణంతో ఆ స్థలాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా దళిత నాయకులు వెళ్లిన చోట పసుపు నీళ్లతో శుద్ధి చేస్తున్నారని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు దళితులు వెళ్లినప్పుడు కూడా ఇదే విధంగా చేశారని.. ఇది యావత్ దళిత సమాజాన్ని అవమానించడమేనని మాదిగ మాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ, నాయకులు ధ్వజమెత్తారు.
సిద్దిపేటలో వెయ్యి డప్పులతో దండోరా..
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు మాదిగ మాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ మాట్లాడుతూ.. దళితులను అవమానించిన కేసీఆర్, బీజేపీ నాయకులు వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో దళితవాడలకు వచ్చే ఆ పార్టీల నాయకులను డప్పులు, గుత్పలతో తరిమికొడతామని హెచ్చరించారు. కేసీఆర్ వైఖరికి నిరసనగా దసరా పండుగ కంటే ముందే సిద్దిపేటలో 1000 డప్పులతో భారీ దండోరా వేస్తామని ప్రకటించారు.
కదం తొక్కిన దళిత నాయకత్వం
ఈ భారీ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షులు బైండ్ల శ్రీనివాస్, దళిత సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్న పాగా రాములుతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. థామస్ మాదిగ (హుస్నాబాద్, కరీంనగర్), మంకాళి రాంచెంద్రం (సిద్దిపేట), బొల్లె సైదులు (సూర్యాపేట), మిద్దె మల్లేష్ (నాగర్ కర్నూల్), బాల్ రాజ్ (గాగిల్లాపూర్, మేడ్చల్), సత్యనారాయణ (అగ్రహారం పొట్లపల్లి, మహబూబ్ నగర్), వీరస్వామి (వనపర్తి), మారేపాక గిరి (నల్లగొండ), దైద శ్యామ్ సుందర్ (అడ్డగుట్ట), మోజెస్ (జగద్గిరిగుట్ట) తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.