హనుమకొండ ( రైట్స్ మీడియా): జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ..
మహాత్మా గాంధీ అహింస, సత్యం, శాంతి, సత్యాగ్రహం వంటి గొప్ప సిద్ధాంతాలతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించారని అన్నారు. దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్య్ర సాధనలో కీలక పాత్ర పోషించిన గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతలను కాపాడుతూ గాంధీజీ కలలు కన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు.
అనంతరం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.