వరంగల్ (రైట్స్ మీడియా): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 33, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచుల అధ్యక్షతన నిర్వహించే గ్రామసభల ద్వారా పారదర్శకంగా చేపట్టాలని బీఆర్‌ఎస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు.
శనివారం నల్లబెల్లిలోని బీఆర్‌ఎస్ మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2025 డిసెంబరులో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగి సర్పంచులు బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని వారు విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా సర్పంచులను పక్కనపెట్టి కమిటీ సభ్యుల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక ప్రక్రియ జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
నల్లబెల్లి సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపికలో సర్పంచులకు బాధ్యతలు కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఈ వ్యవహారంలో సర్పంచులకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, అధికారులు వాటిని అమలు చేయకుండా కమిటీ సభ్యుల ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను గౌరవించి, ప్రభుత్వ జీవో ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో కొందరు అధికార పార్టీ నాయకులు ప్రొసీడింగ్స్ చూపిస్తూ పేద లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 33, హైకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచుల అధ్యక్షతన నిర్వహించే గ్రామసభల ద్వారానే చేపట్టాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కమిటీ సభ్యుల ద్వారా జరుగుతున్న ఎంపిక ప్రక్రియను నిలిపివేసి, అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.