వర్ధన్నపేట రెవిన్యూ శివారులోని కోనారెడ్డి చెరువు సమీపంలో గల వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది నిమ్మని శేఖర్‌రావుకు చెందిన మామిడి తోట భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై జరుగుతున్న రాద్ధాంతానికి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిమ్మని శేఖర్‌రావు కోనారెడ్డి చెరువుకు సంబంధించిన ఒక్క గుంట భూమిని కలుపుకున్నట్లు నిరూపిస్తే.. ఎలాంటి దానికైనా సిద్ధం, అతను చెరువు భూమిని ఆక్రమించుకున్నట్లు తేలితే ఆయనకు ఉన్న తోటలో సగభాగాన్ని రాసి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఓపెన్ చాలెంజ్ చేశారు. భూమి విషయంలో వాస్తవాలు ఏంటో అధికారిక రికార్డులు, సర్వేలు, సంబంధిత రెవెన్యూ పత్రాల ఆధారంగా మాట్లాడాలని తెలిపారు. కేవలం ఆరోపణలు, రాజకీయ విమర్శలతో ఒక వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే చేసిన ఈ ఓపెన్ ఛాలెంజ్‌తో వర్ధన్నపేట మామిడి తోట భూమి వ్యవహారం ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే చేసిన ఓపెన్ ఛాలెంజ్‌ పై ప్రతిపక్షాలు, సంబంధిత వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.