ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఏటూరునాగారం బస్టాండ్ నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏ ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ: జాతీయ రహదారిపై రాస్తారోకో
ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు విద్యా, ఉద్యోగాల్లో తీవ్ర జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసులకు ఉద్యోగాలు కల్పించాలని, ఏజెన్సీ డీఎల్సీ ద్వారా ఏజెన్సీ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏటూరునాగారం ఐటీడిఏ పీవో కి అందజేశారు.1976 నుండి 50 ఏళ్లుగా రాజ్యాంగ సవరణ లేకుండా ఎస్టీ జాబితాలోకి వచ్చి లంబాడీలు రిజర్వేషన్లు పొందుతున్నారని, వారిని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, ఇందుకోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను సిద్దిపేట, సిరిసిల్ల, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు తరలిస్తున్నారని, స్థానిక ఏజెన్సీ మండలాలకు చుక్క నీరు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఐటీడీఏ ద్వారానే పరిపాలన కొనసాగించాలని, లేనియెడల లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో గిరిజనులు, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.