Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

కాగ్నా వంతెనపై మళ్లీ రంధ్రం.. నాణ్యతపై అనుమానాలు!

కాగ్నా వంతెనపై మళ్లీ రంధ్రం.. నాణ్యతపై అనుమానాలు!
Share Short Clip Download PDF

తాండూరు పట్టణ సమీపంలోని కాగ్నా నదిపై నిర్మించిన వంతెనపై మరోసారి రంధ్రం ఏర్పడటం కలకలం రేపింది. గతేడాది జూలైలో ఇదే వంతెనపై రంధ్రం ఏర్పడగా.. తాజాగా శుక్రవారం మరోసారి రంధ్రం పడింది. సుమారు ఐదేళ్లుగా ఈ వంతెనపై రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో రెండుసార్లు రంధ్రాలు ఏర్పడటంపై వాహనదారులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది జూలై చివర్లో కాగ్నా వంతెన రహదారిపై రంధ్రం ఏర్పడింది. దీంతో సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేపట్టారు.

మరమ్మతులు పూర్తయి ఏడాది కూడా గడవకముందే తాజాగా మరోసారి రంధ్రం ఏర్పడటం వంతెన నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది. రహదారిపై ఏర్పడిన రంధ్రం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. రంధ్రం ఏర్పడిన ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులు అటువైపు వెళ్లకుండా
జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.
వంతెనపై రంధ్రం ఏర్పడిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, నేషనల్ హైవే కాంట్రాక్టర్లను పిలిపించి పరిస్థితిపై చర్చించారు. వాహనదారులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..

వంతెన పనులు ఎవరు చేశారనేది ప్రస్తుతం ముఖ్యమైన విషయం కాదని, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగా భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే మరో వంతెన నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని, రెండు వంతెనల్లోనూ ఏవైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. కాగ్నా వంతెనపై వరుసగా రంధ్రాలు ఏర్పడుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వంతెనను పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్మాణ నాణ్యతపై సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.