సమాజంలో ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాలేదు: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
సమాజంలో ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆయనకు బుద్ధి చెప్పినా, ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు.
శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. ఉపాధ్యాయుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల భావన ఎందుకు ఉందో అర్థం కావడం లేదన్నారు. అసత్య ఆరోపణలు చేస్తూ నూతనంగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి భగవంతుడే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, అయితే ఇప్పటివరకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీ సాక్షిగా చర్చకు రావాలని తాము ఆహ్వానించినా జగన్మోహన్ రెడ్డి రాలేదని మండిపడ్డారు.
యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, రాజకీయాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం పనిచేస్తోందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ ప్రారంభమైందని, త్వరలోనే అక్రమాలకు పాల్పడిన వారెవరో తేలుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.