కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్రను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా తెలుగు శాఖ అధ్యక్షులు లింగయ్య మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని, విద్యార్థులలో జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు వారిని ఉన్నతమైన విలువలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమని అన్నారు. గురువు చూపే మార్గదర్శకత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డా. చిర్ర రాజు మాట్లాడుతూ.. గురు–శిష్య సంబంధం భారతీయ విద్యా సంప్రదాయంలో ఎంతో ప్రాచీనమైనదని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థులు గురువుల బోధనలు, సూచనలు పాటిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ అధ్యాపకులు డా. కే. సదాశివ్, టి. అన్నపూర్ణ, డా. బానోత్ స్వామి పాల్గొని, గురుపూజోత్సవ ప్రాధాన్యతను వివరించారు. గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞతాభావం ప్రతి విద్యార్థిలో ఉండాలని వారు పేర్కొన్నారు.