Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఏటీఎంలలో దుర్గమ్మ ప్రసాదం..

ఏటీఎంలలో దుర్గమ్మ ప్రసాదం..
Share Short Clip Download PDF

విజయవాడ(రైట్స్ మీడియా): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా దుర్గమ్మ దేవస్థానంలో ప్రసాదం ఏటీఎంను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు ప్రసాదం కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే శ్రమ లేకుండా లడ్డూ ప్రసాదాన్ని పొందేందుకు ఈ ఆధునిక సాంకేతికత ఎంతో దోహదపడుతుందని దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అన్నారు.

UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపి క్షణాల్లో ప్రసాదం పొందేలా రూపొందించారు. ప్రస్తుతం ట్రయల్ రన్ గా ఏర్పాటు చేశామని.. పనితీరు పరిశీలించిన తర్వాత భక్తుల రద్దీ అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ మరిన్ని యంత్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం అన్నారు. ఉత్సవాల రద్దీ సమయంలోనే కాదు సాధారణ రోజుల్లోనూ సులువుగా లడ్డూ ప్రసాదం పొందొచ్చన్నారు. మరోవైపు ఫేక్ పూజా టికెట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్. దేవాలయ దర్శనాలు, సేవల పేరిట దళారుల ప్రమేయాన్ని ఉపేక్షించేది లేదన్నారు. విజయవాడలో ఇటీవల వెలుగుచూసిన ఫేక్ పూజా టికెట్ల వ్యవహారంపై దేవస్థానం అధికార యంత్రాంగం తక్షణమే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసిందని, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయ సేవలను కేవలం ప్రభుత్వం, దేవస్థానం అధికారికంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లు, డిజిటల్ యాప్‌లు , అధీకృత కౌంటర్ల ద్వారా మాత్రమే పొందాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పారదర్శకంగా సేవా టికెట్లు పొందాలని, దళారులను ప్రోత్సహించవద్దన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ చెప్పారు.

రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. సామాన్య భక్తునికే అగ్రస్థానం కల్పించే దిశగా ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, ప్రసాద వితరణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎండ, వర్షాల బారిన పడకుండా షెడ్ల నిర్మాణం, నిరంతర పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లేలా ప్రణాళికలు రూపొందించామని, ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులందరూ అధికార యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.