నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉండే జంటలను బెదిరించి, వీడియోలు తీసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా ఘర్షణలో యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసును మామునూరు పోలీసులు ఛేదించారు. హత్య, హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు DCP ఈస్ట్ జోన్ అంకిత్ కుమార్ శంక్వార్ తెలిపారు.
జంటలను బెదిరించి, వసూళ్లు.. నలుగురు నిందితుల అరెస్ట్
• అడ్డొచ్చిన యువకుడిని కత్తితో పొడిచి హత్య. | • హత్య కేసును ఛేదించిన మామునూరు పోలీసులు... DCP అంకిత్ కుమార్ శంక్వార్ వెల్లడి.
ఘటన వివరాలు:
తిమ్మాపూర్ ప్రాంతానికి చెందిన సామల పవన్ (25), ఈద జానకి రామ్ (22), ముద్దేపాక మనోజ్ (21), ఎస్.డి. హుస్సేన్ (24) లు ఒక ముఠాగా ఏర్పడి భట్టుపల్లి, అమ్మవారిపేట శివారు ప్రాంతాల్లో బైక్ పై తిరుగుతూ జంటలను మీషోలో కొన్న కత్తితో బెదిరించి వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి, వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఆగస్టు 30న రాత్రి భట్టుపల్లి రోడ్డులో ఒక జంటను బెదిరించి, వీడియో తీయడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 04 వరకు బాధితుల స్నేహితుడైన రోహిత్ ను నిందితులు బెదిరిస్తూ బీర్లు, డబ్బులు డిమాండ్ చేయడంతో రోహిత్, అతని బావమరిది మేకల గిరిధర్ లకు ఫోన్ లో తీవ్ర గొడవ జరిగింది.
హత్య జరిగిన తీరు:
సెప్టెంబర్ 04న రాత్రి ముందస్తు పథకం ప్రకారం నలుగురు నిందితులు కత్తితో పల్సర్ బైక్ లపై బయలుదేరారు. హంస బేకరీ వద్ద, ఆపై ఖమ్మం-వరంగల్ బైపాస్ రోడ్డులోని బేస్తం చెరువు వైపు వెళ్లే మట్టి రోడ్డు వద్ద ఇరువర్గాలు ఎదురుపడ్డారు.
జరిగిన ఘర్షణలో సామల పవన్, ముద్దేపాక మనోజ్ కత్తితో మేకల గౌతమ్ పై దాడి చేసి ఛాతీపై, ఛాతీ కింద, చంక భాగంలో తీవ్రంగా పొడిచాడు. దీంతో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డు వచ్చిన రోహిత్ పై కూడా దాడి చేయడంతో అతని ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. అనంతరం బైక్ లు, కత్తిని పొదల్లో పడేసి పరారయ్యారు.
అరెస్టయిన నిందితులు:
సెప్టెంబర్ 09 ఉదయం RTO జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తప్పించుకునే యత్నం చేసిన నలుగురిని మామునూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1. సామల పవన్ (25), తండ్రి రాజు, కారు డ్రైవర్, మంగలమ్మకుంట, తిమ్మాపూర్ (మిల్స్ కాలనీ PS లో గత కేసు ఉంది).
2. ఈద జానకి రామ్ (22), తండ్రి గణేష్, డిగ్రీ విద్యార్థి, శ్రీ సాయి నగర్, RTA జంక్షన్ (మామునూరు, సుబేదారి PS లలో గత కేసులు).
3. ముద్దేపాక మనోజ్ (21), తండ్రి దుర్గయ్య, కారు డ్రైవర్, పెన్షన్ పూర్, తిమ్మాపూర్.
4. ఎస్.డి. హుస్సేన్, శంబునిపేట / రంగశాయిపేట.
వారి నుండి 5 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
ఈ కేసును ఛేదించిన మామునూరు ఇన్స్పెక్టర్ E. శ్రీనివాస్ , పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్, SI లు ప్రవీణ్, నిస్సార్ పాషా, హరి శంకర్, కానిస్టేబుల్స్ రవి, మంగిలాల్, మోహన్, రమ్య, ముజామీల్ అలీ తదితరులను DCP అంకిత్ కుమార్, ACP మామునూరు అభినందించారు.