కుటుంబం కలహాలు వ్యక్తిగత ప్రశాంతతను దెబ్బతీయడమే కాకుండా కుటుంబ ప్రగతికి అవరోధాలుగా మారతాయని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలోని రాస్ భవనంలోలక్ష్మిపురం క్లస్టర్ లోని పొదుపు సంఘాల సభ్యులకు కుటుంబ సంబంధాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆధునిక జీవనశైలి, పరస్పర అవగాహన లోపం, వ్యక్తిత్వ, ప్రవర్తనా లోపాలు, మానసిక సమస్యలు, ఇతరులతో పోల్చుకోవడం, స్వార్థపూరిత ఆలోచనలు వంటి కారణాలతో కొందరు స్వర్గంలాంటి ఇంటిని అశాంతికి నిలయంగా మార్చుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడంతో పరస్పర సహకారం, పెద్దల మార్గదర్శకత్వం తగ్గి కొన్ని కుటుంబ సమస్యలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు.
దాంపత్య జీవితంలో తలెత్తే అపార్థాలు, అనవసర వాదనలు, అనుమానాలు, పట్టింపులు క్రమంగా తీవ్ర స్థాయికి చేరి విడాకులు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయని తెలిపారు. కుటుంబంలో నిరంతరం ప్రతికూల వాతావరణం ఉంటే మానసిక ప్రశాంతత కోల్పోయి ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతాయని చెప్పారు. దీని ప్రభావం ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులపై కూడా పడుతుందని వివరించారు. ఇంటి సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు పనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేక ఉత్పాదకతను కోల్పోయే అవకాశం ఉందన్నారు.
తల్లిదండ్రుల మధ్య తరచూ జరిగే గొడవలు పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. భయం, ఆందోళనతో పాటు చదువుపై ఏకాగ్రత తగ్గడం, కోపం, మొండితనం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి ప్రవర్తనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందువల్ల పిల్లల ముందు తల్లిదండ్రులు పరస్పరం గౌరవంగా వ్యవహరించడం ఎంతో అవసరమని సూచించారు. కుటుంబ కలహాలు ముదిరి పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లినప్పుడు సమయం, డబ్బు, మానసిక ప్రశాంతత కోల్పోవడంతో పాటు కుటుంబ సామాజిక సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెప్పారు.
కుటుంబంలో చిన్నచిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకుండా పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోవడం, పట్టింపులకు పోకుండా మాట్లాడుకోవడం, తప్పులను క్షమించడం, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం ద్వారా అనేక కుటుంబ కలహాలను నివారించవచ్చని సూచించారు.
ఇంట్లో శాంతి ఉంటేనే కుటుంబంలో సంతోషం, ఆర్థిక స్థిరత్వం, పిల్లల భవిష్యత్తు, సామాజిక ప్రగతి సాధ్యమవుతాయన్నారు. కుటుంబాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
రాస్ పొదుపు సంఘాల ప్రాజెక్ట్ డైరెక్టర్ వి నాగరాజు మాట్లాడుతూ రాస్ సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు మానసిక వికాసం కల్పించాలన్న లక్ష్యంతో తమ సంస్థ పని చేస్తున్నదని తెలిపారు.
కార్యక్రమంలో నాగేశ్వరావు, కాగితాల తేజా, చంద్రకళ, సైకాలజిస్ట్ కవిత, క్లస్టర్ లీడర్లు, 200మహిళలు పాల్గొన్నారు.