తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ తెలిపారు. నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధుల నిర్వహణపై నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ జయకృష్ణ అధ్యక్షతన ఆర్వో, ఏఆర్వోలతో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్వో, ఏఆర్వోల నియామకానికి ఆమోదం తెలిపిందన్నారు. ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైనదని తెలిపారు. ఆర్వో, ఏఆర్వోల పనితీరుపైనే ఎన్నికల విశ్వసనీయత ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు అందరికీ తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సీనియర్ అధికారులు తమ కింద పనిచేసే సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం చేయాలని తెలిపారు. మొదటి విడతగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం వెబ్ సైట్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తాజా సూచనలతో అప్ డేట్ గా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శారదా దేవి, ఉప కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ సురేష్ బాబు, ఏసిపి మూర్తి మరియు వివిధ విభాగాల అధికారులు ఆర్వోలు పాల్గొన్నారు.