Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఎఫ్‌పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

⏩వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించాలి.

ఎఫ్‌పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Share Short Clip Download PDF

ఎఫ్‌పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), సేంద్రీయ రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (భారత ప్రభుత్వ సంస్థ - APEDA) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎగుమతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (APEDA) భారత ప్రభుత్వ సంస్థ అని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి అవసరమైన లైసెన్సులు, నాణ్యత ప్రమాణాలు, దిగుమతిదారులు–ఎగుమతిదారుల మధ్య అనుసంధానం, సరఫరా గొలుసు (సప్లై చైన్) ఏర్పాటు వంటి అంశాల్లో APEDA కీలక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని వివరించారు.

జిల్లాలో ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా చిట్టి ముత్యాలు బియ్యం ఎగుమతులకు అధిక డిమాండ్ (గిరాకీ) ఉందన్నారు. MTU–1010 పారాబాయిల్డ్ రైస్ రకానికి విదేశాల్లో మంచి మార్కెట్ ఉందని, తెలంగాణ నుంచి ఈ రకం బియ్యాన్ని 22 వేల మెట్రిక్ టన్నులు ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేసినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 44 వేల ఎకరాల్లో MTU–1010 రకం సాగు జరుగుతుండగా, అది జిల్లాలోని వరి సాగులో 26 శాతం వాటా కలిగి ఉందని చెప్పారు. ఈ రకం బియ్యానికి విదేశీ మార్కెట్లో సుమారు రూ.3,600 వరకు ధర లభిస్తోందని పేర్కొన్నారు.

భారత్ కృషి నిర్యాత్ యోజన పథకం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే అవకాశాలను రైతులు, ఎఫ్‌పీఓలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో ఉన్న 22 ఎఫ్‌పీఓలు, రైతులు, ఎగుమతుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, APEDA ద్వారా లభించే సహాయ సహకారాలను ఉపయోగించుకుని అంతర్జాతీయ విపణిలో తమ ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరించాలని సూచించారు.

జిల్లాలోని రైతులు, ఎఫ్‌పీఓలకు ప్రత్యక్ష మార్కెట్ అవకాశాలు కల్పించేలా రాబోయే 30 రోజుల్లో కొనుగోలుదారులు - ఖరీదుదారుల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ఎఫ్‌పీఓ మేళాలను కూడా నిర్వహించి, రైతులను ఎగుమతి మార్కెట్లతో అనుసంధానం చేయాలన్నారు. చిట్టిముత్యాలు సువాసన బియ్యాన్ని ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (PMFME)లోని ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ODOP) జాబితాలో ఉన్న ప్రత్యేక ఉత్పత్తిగా అభివృద్ధి చేయాలన్నారు. స్వచ్ఛమైన విత్తనం, ప్రత్యేక మిల్లింగ్, ప్రత్యేక లాట్లు, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కల్తీ నివారణ, ముందస్తు కొనుగోలుదారుల ఒప్పందాలతో ప్రీమియం బ్రాండ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ప్రస్తుతం ఖరీఫ్ పంట కోత దశలో ఉన్నందున యాసంగి 2026–27 నుంచి అవశేషాల నియంత్రిత క్లస్టర్‌ను ప్రారంభించాలన్నారు. జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), రైస్ మిల్లర్లు, ప్రాసెసర్లు DGFT పోర్టల్ ద్వారా APEDA e-RCMC నమోదు పొందాలని సూచించారు. ISO 22000/HACCP ధృవీకరణ, SFDA నమోదుకు ఎంపిక చేసే రైస్ మిల్లుల జాబితా సిద్ధం చేయాలన్నారు. యాసంగి 2026–27 కోసం అవశేషాల నియంత్రిత బియ్యం క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, పాల్గొనే FPO, ఎగుమతిదారుని గుర్తించాలన్నారు.

అంతకుముందు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన అవకాశాలు, నాణ్యత ప్రమాణాలు, మార్కెటింగ్, APEDA అందించే సహాయం, ఎగుమతి ప్రక్రియపై ఈ అవగాహన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా APEDA అసిస్టెంట్ మేనేజర్ సుకేష్ సమగ్రంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. అంబికా సోని, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, APEDA అసిస్టెంట్ మేనేజర్ సుకేష్, నాబార్డ్ డీడీఎం విజయ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రతిభ, కృషి సఖీలు, జిల్లాలోని ఎఫ్‌పీఓలు, ఎఫ్‌పీసీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా