వికసిత్ భారత్ నిర్మాణంలో సమాజంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప ఉత్సవాలు’ నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడ రామారావు కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర కార్యశాలను ఆయన ప్రారంభించారు.
ప్రధాని మోదీ దేశం కోసం పూర్తి స్థాయి అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడని మాధవ్ పేర్కొన్నారు. సమస్యలు, సవాళ్లను ముందుగానే గుర్తించి పరిష్కారాలు చూపుతూ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోదీకి విశేష గుర్తింపు లభించిందన్నారు. త్రివర్ణ పతాకానికి అంతర్జాతీయంగా గౌరవం పెరగడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు.
కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలు భారత్ తీవ్రంగా దెబ్బతింటుందని భావించాయని, అయితే దేశీయంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి ప్రజలకు అందించడంతో పాటు ఇతర దేశాలకు కూడా సరఫరా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఇబ్బంది లేకుండా ముందుచూపుతో క్రూడ్ ఆయిల్ నిల్వలను ఆరు నెలలకు సరిపడా సిద్ధం చేసినట్లు తెలిపారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ సాధించిన అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు ఆయన ప్రధానిగా ఎదిగారని మాధవ్ అన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేరాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.