Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి
Share Short Clip Download PDF

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతికి అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యుడు రాంబాబు నాయక్ జిల్లా పర్యటనకు రాగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె స్వాగతం పలికి.. పుష్పగుచ్చం అందజేశారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, కమిషన్ సభ్యుడు రాంబాబు నాయక్ తో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పథకాల అమలు, సంక్షేమం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న పథకాలు, సంక్షేమం, అట్రాసిటీ కేసుల పరిష్కారం గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, కులాంతర వివాహాల ఆర్థిక చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ కార్డు కలిగిఉన్న ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న పని వివరాలను అధికారుల ద్వారా సమీక్షించారు.
ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు ఛార్జ్ షీట్ దాఖలు వివరాలు తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదయిన కేసుల దర్యాప్తు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారం అందేవిధంగా చూడాలని వివరించారు.

ప్రతినెలా చివరి వారంలో మండలాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ సమావేశాల్లో పాల్గొని, ప్రజల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలు, చట్టాల గురించి అవగాహన కల్పించాలని వివరించారు. ప్రజలకు మానవీయ కోణంలో సేవలు అందించాలని సూచించారు.
ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఏవైనా అభివృద్ధికి సంబంధించి నిధులు పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి విడుదల అయ్యేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల అభ్యున్నతితో పాటు, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా మరింత కృషి చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో లోని పారిశుధ్య కార్మికులకు ఎస్ బీ ఐ బ్యాంక్ ఖాతాలు తీయించాలని, దీంతో కార్మికులకు భీమా సౌకర్యం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు వివరాలు వెల్లడించారు. ఎస్ డీ ఎఫ్ కింద ఎస్సీలకు 169 పనులు అంచనా వ్యయం రూ. 4 కోట్ల 29 లక్షలు, ఎస్టీ లకు 38 పనులు అంచనా వ్యయం రూ. 89 లక్షలతో పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ ఏడాది మొత్తం 32 అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయని పోలీస్ శాఖ అధికారులు వివరించారు.

జిల్లాలో ఎస్సీ 9 ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో 337 మంది బాలురు, 80 బాలికలు, మూడు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 106 మంది బాలురు, 179 మంది బాలికలు చదువుతున్నారని తెలిపారు.
ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు లో 97మంది అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 1330, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.1540, ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.2100 డైట్ చార్జీలు పెంచిందని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కాస్మొటిక్ చార్జీలు దాదాపు మూడు ఇంతలు పెంచిందని వెల్లడించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డిఆర్ఓ జయశ్రీ, వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.