Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి అన్ని నీటి వనరులను నింపాలి: సీఎం చంద్రబాబు

వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి అన్ని నీటి వనరులను నింపాలి: సీఎం చంద్రబాబు
Share Short Clip Download PDF

వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలను సమర్థంగా వినియోగించుకుని రాష్ట్రంలోని అన్ని నీటి వనరులను నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లోని రిజర్వాయర్లతో పాటు వాటి పరిధిలో ఉన్న వివిధ నీటి వనరులను కూడా నింపాలని స్పష్టం చేశారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రంలో గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్‌, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలు, రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావంపై చర్చించారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భ జలమట్టాలు కొంతమేర పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకాశం బ్యారేజీకి మున్నేరు సహా ఇతర క్యాచ్‌మెంట్‌ ప్రాంతాల నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ప్రాజెక్టుల దిగువన ఉన్న అన్ని నీటి వనరుల్లో వర్షపు నీటిని నిల్వ చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట మోటార్లను వినియోగించి నీటిని ఎత్తిపోసుకోవాలని సూచించారు.

గోదావరి నుంచి వస్తున్న ప్రవాహాలను వినియోగించుకుని ఏలేరు రిజర్వాయర్‌లో 24 టీఎంసీల నీటిని నింపాలని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు నీటిని వివిధ నీటి వనరుల్లోకి మళ్లించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉందని తెలిపారు.

ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను మార్చడం సాధ్యం కాకపోయినా.. వాటి ప్రభావాన్ని తగ్గించేలా అంతర్గత పరిస్థితులను మెరుగుపరచుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూసారాన్ని పెంచడం, నేల పరీక్షల ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, బయోచార్‌, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యుత్‌ టారిఫ్‌ను పెంచకపోయినా, సేవల్లో లోపాల కారణంగా ప్రజల్లో సంతృప్తి తగ్గుతోందని పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో 287.214 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉన్న నేపథ్యంలో, విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన నీటి లభ్యతపైనా దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, ధరలు, సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. శాప్‌ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా నిర్వహించాల్సిన క్రీడా కార్యక్రమాలతో వార్షిక క్రీడా క్యాలెండర్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి అన్ని నీటి వనరులను నింపాలి: సీఎం చంద్రబాబు