Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

22-A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

22-A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ
Share Short Clip Download PDF

22-A నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత జాబితాలోని భూముల వివరాలపై కమిటీ దృష్టి సారించనుంది.

తెలంగాణలో 22-A నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 22-A భూములపై అధ్యయనం చేసి.. సమస్యలను పరిష్కరించేందుకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఛైర్‌పర్సన్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్ కుమార్ ఝా‌తో పాటు సిద్ధిపేట, రంగారెడ్డి, సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా భూముల రికార్డులను పరిశీలించి.. 22-A జాబితాలో భూములు ఎలా చేరాయి? వాటి వెనుక ఉన్న కారణాలేంటి? అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగించాలి? అనే అంశాలపై కమిటీ దృష్టి సారించనుంది.

22-A జాబితాలో తప్పుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ప్రభుత్వం కూడా స్పందించింది. అధికారుల తప్పిదాల వల్ల కొన్ని భూములు నిషేధిత జాబితాలో చేరినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 22-Aకు సంబంధించిన 12 రకాల సమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. పెండింగ్ రిజిస్ట్రేషన్లు, లేఅవుట్లు, అసైన్డ్ భూములు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన భూములు సహా.. పలు కీలక అంశాలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.