అహ్మదాబాద్(రైట్స్ మీడియా): ఫార్మాస్యూటికల్స్, పవర్, గ్యాస్, ఎలక్ట్రికల్ రంగాల్లో పేరెన్నికగన్న టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా, డైరెక్టర్ షాన్ మెహతా, హోల్టైమ్ డైరెక్టర్ జిగీష్ మెహతాలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం అహ్మదాబాద్ లో సమావేశమయ్యారు.
ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలి: మంత్రి నారా లోకేష్
ఫార్మాస్యూటికల్స్, పవర్, గ్యాస్, ఎలక్ట్రికల్ రంగాల్లో పేరెన్నికగన్న టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా, డైరెక్టర్ షాన్ మెహతా, హోల్టైమ్ డైరెక్టర్ జిగీష్ మెహతాలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం అహ్మదాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో టోరెంట్ గ్రూప్ పెట్టుబడులు, విస్తరణ అవకాశాలపై చర్చించారు.
బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో భాగంగా టోరెంట్ వైజాగ్ ప్లాంట్ ఏపీఐలు, అధునాతన ఇంటర్మీడియేట్లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ఫార్మా క్లస్టర్లలో ఏపీఐ తయారీ, ఇంటర్మీడియట్ సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను అన్వేషించాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
టోరెంట్ గ్రూప్ తన రెన్యువబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియోను గణనీయంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో సౌర, పవన, హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మాలిక్యూల్స్ రంగాల్లో టోరెంట్ పవర్ ప్రకటించిన విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ఇతర క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడి గమ్యస్థానంగా విశ్వసిస్తున్న టోరెంట్ గ్రూప్ ను మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన సహకారం, అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.
టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా మాట్లాడుతూ, హై-పొటెన్సీ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని తమ సంస్థ విస్తరిస్తోందని తెలిపారు. టోరెంట్ పవర్ ప్రస్తుతం 3.96 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, 3 గిగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోందని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ తో పాటు ఇతర క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను కూడా అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. 2030 నాటికి 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించడమే తమ లక్ష్యమని సమీర్ మెహతా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.