భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఖాతాలో మరో చారిత్రక ఘనత చేరింది. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణ రంగాల్లో కీలకమైన EOS-05 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ విజయవంతమైంది. తెల్లవారుజామున 2.55 గంటలకు షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 వాహకనౌక మేఘాలను చీల్చుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.
సరిగ్గా 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని సబ్-జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి రాకెట్ కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. సాధారణంగా లో-ఎర్త్ ఆర్బిట్, సన్ సింక్రోనస్ ఆర్బిట్లలో ఉండే ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని ఫొటో తీయడానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పడుతుంది. కానీ ఈఓఎస్-05 భూస్థిర కక్ష్యలో ఉంటూ.. ఒకే ఫ్రేమ్లో మొత్తం దక్షిణాసియాను ఫొటో తీయగలదు. భారత ఉపఖండం మొత్తాన్ని కేవలం 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి పంపగలదు. ఇందులో అమర్చిన ఎంఎక్స్-వీఎన్ఆర్ పేలోడ్ అద్భుతమైన 42 మీటర్ల స్పేషియల్ రిజల్యూషన్ను కలిగి ఉంది. జియో కక్ష్యలో ఇంతటి అత్యుత్తమ రిజల్యూషన్ కలిగిన కెమెరాతో ఉన్న ఉపగ్రహం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ప్రస్తుతం ఇస్రోకు ఉన్న సామర్థ్యంతో పోలిస్తే.. దీని పిక్సెల్ డెన్సిటీ 567 రెట్లు మెరుగ్గా ఉంది. అత్యుత్తమ పాన్క్రోమాటిక్ ఇమేజర్లను సైతం వెనక్కి నెట్టి అత్యంత స్పష్టమైన చిత్రాలను తీయగల సత్తా దీని సొంతం. వరదలు, తుపాన్లు, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పాత చిత్రాలతో పోల్చుకునే పని లేకుండా.. దాదాపు రియల్-టైమ్లో వాటి తీవ్రతను అంచనా వేయవచ్చు. పంటల ఆరోగ్యం, అటవీ ప్రాంతాలు, నీటి వనరుల్లో కాలుష్యం, ఖనిజ సంపద పంపిణీ తదితర వివరాలను ఈ హైపర్, మల్టీ స్పెక్ట్రల్స్ కెమెరాలు సులువుగా గుర్తిస్తాయి. 2021 ఆగస్టులో జీఎస్ఎల్వీ-ఎఫ్10 మిషన్ ద్వారా ప్రయోగించిన జీశాట్-1 ఉపగ్రహం విఫలమై కక్ష్యను చేరుకోలేకపోయింది. ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపేస్తూ, దానికి ప్రత్యామ్నాయంగా మరింత మెరుగైన సాంకేతికతతో ఇస్రో ఇప్పుడు ఈఓఎస్-05ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చి తన సత్తా చాటింది. ఈ ఏడాది ఆరంభంలో ఎదురైన పీఎస్ఎల్వీ వైఫల్యాన్ని సైతం పక్కకునెట్టి ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్త ఉత్సాహంతో అడుగులు ముందుకేశారు.