భారత్ కు ఎంత చమురు కావాలంటే అంత అందించడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ రాయబారి డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు. రష్యా చమురు వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని పాశ్చాత్య దేశాలు విధిస్తున్న సెకండరీ ఆంక్షలు, సుంకాలు కేవలం ఒత్తిడి తెచ్చే చర్యలే తప్ప, నిజాయితీతో కూడిన సహకారం కాదని ఆయన మండిపడ్డారు. అమెరికా, యూరప్ వంటి దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో భారత్-రష్యా ఇంధన బంధంపై మాస్కోకు నమ్మకం ఉందా అన్న ప్రశ్నకు అలిపోవ్ స్పందిస్తూ.. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. రష్యా చమురును పక్కనపెడితే ప్రపంచ ఇంధన మార్కెట్లు తట్టుకోలేవని, భారత్ అవసరాలకు తగ్గట్టుగా తాము నిరంతరం చమురు సరఫరా చేస్తూనే ఉంటామని ఆయన తేల్చిచెప్పారు.