తెనాలి(రైట్స్ మీడియా): 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ వంద శాతం పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదలకు సొంతిల్లు ఉంటే వారి జీవన ప్రమాణాలతో పాటు ఆత్మగౌరవం పెరుగుతుందని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ఆదివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు కుటుంబంతో కలిసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రానికి సాధారణ కోటా కింద 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని చంద్రబాబు తెలిపారు. ఈ 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగానే మరో 3 లక్షల ఇళ్లను, వచ్చే ఏడాది మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అంగీకరించారని చెప్పారు. మొత్తంగా 9 లక్షల ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసేందుకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. 3 లక్షల ఇళ్ల నిర్మాణం అంటే కేవలం ఇళ్ల నిర్మించడమే కాదని, 3 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పునకు శ్రీకారం చుట్టే కార్యక్రమమని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు వేసిన ఓటుతో సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ చేర్చేలా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.
గృహ నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు బుర్రిపాలెంలో రూ.14 కోట్లతో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ద్వారా 177 ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం సందర్శించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి అధికారులు వివరించారు. 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో పటిష్టమైన ఇళ్లను నిర్మించవచ్చని అధికారులు వివరించారు. ఈ సాంకేతికతతో నిర్మించే ఇళ్లలో బయట వాతావరణంతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించినట్టు సీఎం అన్నారు.