హైదరాబాద్, 26 అక్టోబర్ 2026(రైట్స్ మీడియా): అర్హులైన పౌరులకు బ్యాంకింగ్ సేవలు, సామాజిక భద్రతా పథకాలు, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాలు అందేలా కేంద్ర‌ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌ (డీఎఫ్‌ఎస్) తెలంగాణ‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆర్థిక సమ్మిళిత (ఎఫ్‌ఐ) పథకాలను అర్హులందరికీ అందించ‌డ‌మే ల‌క్ష్యంగా 2026 అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల నమోదుకు స‌హాయ‌ప‌డేందుకు, ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలు (జీపీలు), పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీలు) బ్యాంకు శాఖలు శిబిరాలు నిర్వహిస్తాయి.

ప్రధాన‌మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన‌మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల్లో నమోదుపై ఈ కార్యక్రమం ప్ర‌త్యేక‌ దృష్టి సారిస్తోంది. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై కింద ఆధార్ అనుసంధానం, ప్రధాన‌మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలు తెరవడం, అత్యంత వెనుకబడిన గిరిజన తెగల (పీవీటీజీ) కుటుంబాలకు పీఎంజేడీవై ఖాతాలు తెరవడం వంటి ఇతర కార్యకలాపాలను కూడా చేపడుతున్నారు.

ఇన్ఆప‌రేటీవ్‌ పీఎంజేడీవై ఖాతాలను తిరిగి వినియోగంలోకి తేవడం, ఇప్పటికే ఉన్న పీఎంజేడీవై, ఇతర పొదుపు ఖాతాలకు రీ-కేవైసీ నిర్వహించడం, పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ కేవైసీ (సీ-కేవైసీ) ఐడీలను రూపొందించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యాలు. పొదుపు ఖాతాలు, లాకర్లు సహా ఇతర సదుపాయాలకు సంబంధించిన నామినీ వివరాలను కూడా నవీకరిస్తున్నారు.

ఆర్థిక సమ్మిళిత పథకాలు, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ మోసాల నివారణపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఎవరూ క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులపై అవగాహన పెంచేందుకు “ఆప్‌కీ పూంజీ, ఆప్‌కా అధికార్” కార్యక్రమాన్ని సైతం ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రోత్సహిస్తున్నారు. అర్హులైన పీఎం-కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) సదుపాయం అందించేందుకు దరఖాస్తుల సేకరణకు కూడా తోడ్పడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ శ్రీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు శాఖలు గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో శిబిరాలు నిర్వహిస్తాయని తెలిపారు. ఈ శిబిరాల్లో ఆర్థిక అక్షరాస్యత, సామాజిక భద్రతా పథకాలు, డిజిటల్ బ్యాంకింగ్, ఆర్థిక మోసాలను నివారించే చర్యలపై సమాచారం అందిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులను నమోదు చేస్తూ, అవసరమైన పత్రాలను బ్యాంకు అధికారులు సేకరిస్తున్నారు.

ప్రధాన‌మంత్రి సురక్షా బీమా యోజన కింద 18 నుంచి 70 ఏళ్ల వయసున్న అర్హులకు ఏటా ₹20 ప్రీమియంతో ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తి వైకల్యం సంభవిస్తే ₹2 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ప్రధాన‌మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 18 నుంచి 50 ఏళ్ల వయసున్న అర్హులకు ఏటా ₹436 ప్రీమియంతో ఏ కారణంతో మరణించినా ₹2 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుందని వివ‌రించారు. అటల్ పెన్షన్ యోజన కింద నిర్దేశిత చందాలు, అర్హత నిబంధనలకు లోబడి, చందాదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ అందుతుందని తెలిపారు.

తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో 12,760 గ్రామ పంచాయతీలు, 136 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్నారు. సమీపంలోని బ్యాంకు శిబిరాన్ని సందర్శించి, తమకు అర్హత ఉన్న పథకాల ప్రయోజనాలను పొందాలని పౌరులకు శ్రీ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయ‌న‌ సూచించారు.

ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి, లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను కోరారు.