Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఆత్మకూరు పీహెచ్‌సీలో ఎల్‌సీడీసీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య

ఆత్మకూరు పీహెచ్‌సీలో ఎల్‌సీడీసీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య
Share Short Clip Download PDF

హనుమకొండ (రైట్స్ మీడియా): కుష్టు వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సమిష్టిగా కృషి చేయాలని హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ. అప్పయ్య విజ్ఞప్తి చేశారు.

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలో చేపట్టిన లెప్రసీ కేసుల గుర్తింపు ప్రచార కార్యక్రమం (Leprosy Case Detection Campaign - LCDC) సర్వేను గురువారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య ప్రారంభించి మాట్లాడుతూ, కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి వల్ల కలిగే వైకల్యాలను నివారించడంతో పాటు వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించాలని, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షల నిమిత్తం సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని సూచించారు.

కుష్టు వ్యాధి సోకిన వారిలో సాధారణ చర్మపు రంగు కంటే తక్కువ రంగు లేదా రాగి రంగులో మచ్చలు కనిపించవచ్చని, ఆ మచ్చలపై స్పర్శ జ్ఞానం తగ్గడం లేదా లేకపోవడం ప్రధాన లక్షణమని వివరించారు. వ్యాధి నరాలను ప్రభావితం చేసినప్పుడు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత, స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చని తెలిపారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

కుష్టు వ్యాధికి సంబంధించిన పరీక్షలు, చికిత్స ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాధిపై భయాందోళనలు విడనాడాలని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. సర్వేలో గుర్తించిన అనుమానిత కేసులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచిత చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆత్మకూరు పీహెచ్‌సీలో ఎల్‌సీడీసీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య

అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి. మదన్ మోహన్ రావు మాట్లాడుతూ,

కుష్టు వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి సాధారణంగా మూడు నుంచి ఐదు సంవత్సరాలు పట్టవచ్చని వివరించారు. కుష్టు వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదని, అది శాపం లేదా పాపం వల్ల వచ్చే వ్యాధి కాదని స్పష్టం చేశారు. బహుళ ఔషధ చికిత్స (MDT) ద్వారా కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి రకాన్ని బట్టి సాధారణంగా ఆరు నుంచి పన్నెండు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

కుష్టు వ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ఎల్‌సీడీసీ సర్వేకు ప్రజలందరూ సహకరించి, ఆరోగ్య సిబ్బందికి అవసరమైన సమాచారం అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి. మదన్ మోహన్ రావు, ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్పందన, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, డీపీఎంఓలు రవీందర్, ఎల్లయ్య, దేవ్ సింగ్, సీహెచ్‌ఓ జునేధి, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.