హనుమకొండ (రైట్స్ మీడియా): కుష్టు వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సమిష్టిగా కృషి చేయాలని హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ. అప్పయ్య విజ్ఞప్తి చేశారు.
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పరిధిలో చేపట్టిన లెప్రసీ కేసుల గుర్తింపు ప్రచార కార్యక్రమం (Leprosy Case Detection Campaign - LCDC) సర్వేను గురువారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ప్రారంభించి మాట్లాడుతూ, కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి వల్ల కలిగే వైకల్యాలను నివారించడంతో పాటు వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించాలని, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షల నిమిత్తం సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని సూచించారు.
కుష్టు వ్యాధి సోకిన వారిలో సాధారణ చర్మపు రంగు కంటే తక్కువ రంగు లేదా రాగి రంగులో మచ్చలు కనిపించవచ్చని, ఆ మచ్చలపై స్పర్శ జ్ఞానం తగ్గడం లేదా లేకపోవడం ప్రధాన లక్షణమని వివరించారు. వ్యాధి నరాలను ప్రభావితం చేసినప్పుడు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత, స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చని తెలిపారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
కుష్టు వ్యాధికి సంబంధించిన పరీక్షలు, చికిత్స ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాధిపై భయాందోళనలు విడనాడాలని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.