జిల్లాలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శుక్రవారం సంబధిత అధికారులతో సందర్శించి, పనులను పరిశీలించారు. పరిశీలన అనంతరం పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో ఆసుపత్రి భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, పారిశుధ్యం తదితర పనుల పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అందుకు ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంజీఎం పర్యవేక్షకులు హరీష్చంద్ర రెడ్డి, DY.ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, GWMC రాజకుమార్, ఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం, ఆర్ & బీ ఈఈ రాజేందర్, ఆర్డీఓ సుమ, ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సర్వాణన్, తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.