కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని వక్తలు డిమాండ్‌ చేశారు. టీజీజాక్‌, TUNTEA రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఆకుట్‌, కేయూ ఎన్‌జీఓస్‌, క్లాస్‌–4 ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో “సెప్టెంబర్‌ 1 – పెన్షన్‌ విద్రోహ దినం” సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కేయూ ఎన్‌జీఓస్‌ అధ్యక్షుడు బూరా నవీన్‌ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఆకుట్‌ జనరల్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ ఎల్‌.పి. రాజ్‌కుమార్‌, కేయూ ఎన్‌జీఓస్‌ జనరల్‌ సెక్రటరీ వల్లాల తిరుపతి, క్లాస్‌–4 ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ బొక్క మొగిలి, కేయూ సీపీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటి దామోదర్‌ మాట్లాడుతూ, ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సుమారు 33 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ సేవ అనంతరం పెన్షన్‌ భద్రత లేకుండా పదవీ విరమణ చేయడం ఉద్యోగులకు తీవ్ర అన్యాయం అని అన్నారు. పెన్షన్‌ అనేది ప్రభుత్వం ఉద్యోగులకు చేసే దయ కాదని, దీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులకు లభించాల్సిన హక్కు అని వారు పేర్కొన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసే వరకు ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సతీష్‌ బాబు, తోట ప్రభాకర్‌, గుమ్మయ్య, అంకుస్‌, బి. కృష్ణవేణి, మల్లికాంబ, తీర్మాలసింగ్‌, వాలిపాషా, పి. నర్మద, బి. సృజన, అనిత, జ్యోతి, కల్పన, నవ్య, భూపాల్‌రెడ్డి, వాసు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణకు మద్దతుగా నినాదాలు చేశారు.