Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Share Short Clip Download PDF

అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన డబ్బు ఇంకా లెక్కపెడుతున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తుందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సిగ్గు ఉంటే, తెలంగాణ పౌరుషం ఉంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పి నిరసనలు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.

జఫర్ గడ్ మండలం తిమ్మంపేట లోని రేణుక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జఫర్ గడ్ మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం మరియు మండల విస్తృత స్థాయి సమావేశానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వ 1000రోజుల పాలనపై బిఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనలు చేపట్టే ముందు బిఆర్ఎస్ పై కల్వకుంట్ల కవిత తీవ్రమైన ఆరోపణలు చేస్తుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన డబ్బు ఇంకా లెక్కపెడుతున్నారని, కాళేశ్వరం కుంగిపోవడానికి హరిష్ రావు అవినీతే కారణం అని ఆరోపిస్తున్నారని తెలిపారు. బిఆర్ఎస్ పాలనలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ఫామ్ హౌస్ లు, ప్యాలెస్ లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇవాళ అధికారం కోల్పోయామనే అక్కసుతో వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు నిరసనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లతో పేదల స్వంత ఇంటి కళను చేసినందుకా....? సన్న బియ్యంతో పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెడుతున్నందుకా....? వ్యవసాయంతో పాటు ఇంటికి 200యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకా....? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నందుకా.... కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తున్నందుకా.....? ఋణ మాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ ఇస్తున్నందుకా....? దేనికి నిరసనలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కలరాసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మన హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కాపాడబడుతాయని వెల్లడించారు. అందుకోసం ఈ రోజు నుండే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. పార్టీలో కొత్త పాత అనే విభేదాలు పక్కన పెట్టి అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి పని చేద్దామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని అందులోకి కొత్త నీరు వస్తూనే ఉంటుంది పాత నీరు పోతూనే ఉంటుందని ఏదేమైనా సముద్రం నిలకడగానే ఉంటుందని తెలిపారు. కొత్తగా ఎంపికైన మండల గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు అందరిని కలుపుకొని పోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది క్రమశిక్షణతో ప్రజలకోసం, పార్టీ కోసం పని చేసే వారు కలవాలని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నాయకులను ఆహ్వానిస్తుందని, గౌరవిస్తుందని అన్నారు. అలాంటిది అధికారంలోకి రావాలనుకుంటున్న మనం కూడా ప్రజలలో పట్టున్న వారిని, పార్టీ కోసం పని చేసే వారిని ఆహ్వానించాలని తెలిపారు. నేనే గొప్ప నేనే సీనియర్ అనే అహంభావాన్ని పక్కన పెట్టాలని చెప్పారు.

2029 ఎన్నికలలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురావేయడమే లక్ష్యంగా పని చేస్తున్నానని తెలిపారు. అందుకు కట్టుబడి ప్రతి నిత్యం కృషి చేస్తున్నాని అదే విధంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలని సూచించారు. అలా పని చేసినప్పుడే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రెండవ సారి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను గట్టిగా తిప్పోకొట్టాలని అన్నారు. జఫర్ గడ్ మండలంలో ప్రతీ గ్రామంలో కోటి రూపాయల నుండి 5కోట్ల వరకు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో ఎం జరుగుతుందో, ఎవెరెవరు ఎం చేస్తున్నారో ప్రతీ విషయం నాకు తెలుసని కానీ కొన్ని చూసి చూడనట్లు, విని వినినట్లు ఉంటానని అంతే తప్పించి నాకు తెలియదు అని మాత్రం అనుకోవద్దని హెచ్చరించారు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బూతుకు 10చొప్పున ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను సెప్టెంబర్ 15లోగ లాగే గ్రామానికి 10 నుండి 25లక్షల వరకు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి అందజేయాలని సూచించారు. వచ్చే రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే ఏకైక ఎజెండగా అందరం కలిసికట్టుగా పని చేద్దామని మరోసారి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శులు అన్నబోయిన బిక్షపతి, ఇల్లందుల బేబీ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, నూతనంగా ఎంపికైన గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇంచార్జ్ లు, బీఎల్ఏలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.