హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, అనంతరం మంత్రులతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.

కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డు, ట్రామా విభాగం, ఐసీయూ వంటి విభాగాలను మంత్రులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

చికిత్స కోసం వచ్చే వారి నమోదు, రిసెప్షన్‌లో టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పని తీరు, ఓపీ కౌంటర్ పనితీరును పరిశీలించారు. ఆయా విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడారు. అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి వాటి పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.